మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్‌బీసీ(SLBC) టన్నెల్ ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేతకానితనం, వైఫల్యాల వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. 2014 నుంచి 2023 వరకు 200 కిలోమీటర్లు టన్నెల్ పనులను పూర్తి చేసినట్లు హరీష్ రావు చెప్తున్నారని, పదేళ్లలో మిగిలిన 19 కిలోమీటర్లు ఎందుకు పూర్తి చేయలేదని, తవ్వడం చేతకాలేదా? అంటూ నిలదీశారు.
ఇప్పుడు వచ్చి హరీష్ రావు(Harish Rao).. సొల్లు పురాణం మాటలు మస్త్‌గా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అడిగిన ప్రశ్న తప్ప మిగిలిన అన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారని చురకలంటించారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి బాగోగులపై అంత ఆందోళనే ఉంటే.. ప్రమాదం జరిగిన తర్వాత రోజే అక్కడకు ఎందుకు రాలేదు హరీష్? ఐదు రోజులు ఆగి ఆరో రోజున అక్కడకు వచ్చి గలాటా సృష్టించాలని ప్రయత్నించడం ఏంది? అని ప్రశ్నించారు.
‘‘వంద బండ్లు వేసుకుని ఏదో యుద్ధానికి వెళ్తున్న తరహాలో ఎస్ఎల్‌బీసీ దగ్గరకు వచ్చారు హరీష్. అడిగిన ప్రశ్నను విడిచి అన్నింటిపై స్పందిస్తారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లోకి నేనొక్కడినే వెళ్లాను. టన్నెల్‌లోకి నీళ్లు, బురద వచ్చి అంతా మూసుకుపోయింది. అది తీస్తే మళ్ళీ వరద వస్తుంది కదా. ఎనిమిది మందిని కాపాడటం కోసం వందమంది లోపలికి వెళ్లారు. అలాంటప్పుడు నీళ్లు, బురద వస్తే అది ఇంకో ప్రమాదంగా మారుతుంది. సహాయక చర్యలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
నిపుణులు చెప్పినట్లు చర్యలను ముందుకు కొనసాగిస్తున్నాం. జిల్లా మంత్రిగా టన్నెల్‌లోకి నేనే వెళ్లా. తమను రానివ్వలేదంటూ కొందరు డ్రామాలు ఆడుతున్నారు. అసలు వారిని ఎస్ఎల్‌బీసీ దగ్గరకు రావడానికి అనుమతి ఇచ్చిందే మేము. కానీ వాళ్లు మాత్రం రాజకీయ లబ్దికోసం డ్రామా చేస్తున్నారు. పరామర్శించాలి, పరిస్థితులను పరిశీలించాలి అనుకునేవారు ఎవరైనా వంద వాహనాల్లో వస్తారా?’’ అని ప్రశ్నించారు జూపల్లి(Jupally Krishna Rao).