తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరో వివాదంలో ఇరుక్కున్నారు. రాష్ట్రమంతా సంచనలంగా మారిన వేములవాడ(Vemulawada) రాజన్న కోడెదూడల అక్రమ అమ్మకాల వివాదంలో మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మంత్రి అనుమతితోనే అక్రమాలు జరిగాయన్న చర్చ జోరుగా సాగుతోంది. కోడెల పంపిణీ విషయంలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఒంటెద్దుపోకడ పోతున్నాడని, కోడెలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేయడంతో అ అక్రమాలు వెలుగు చూశాయి.
మంత్రి ప్రమేయంతోనే కోడెలు పక్కదారి పడుతున్నాయని హిందూ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి 49 కోడెదూడలను ఆలయ అధికారులు అందించడం కూడా మంత్రి కనుసన్నల్లోనే జరిగిందని వారు ఆరోపించారు.
రైతులకు నామమాత్రంగా రెండు మూడు కోడెళ్లను అందించింది. రాంబాబు అనే వ్యక్తికి మాత్రం 49 కోడెళ్లను ఇవ్వడం ప్రస్తుతం తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. కాగా కోడెళ్లను తాను టెండర్ ద్వారా పొందానని రాంబాబు అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులకు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పశువుల వ్యాపారి అయిన మంత్రి(Konda Surekha) అనుచరుడు రాంబాబుకు.. 49 కోడెళ్లను అనధికారికంగా కట్టబెట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే వ్యక్తికి భారీ సంఖ్యలో కోడె దూడలను కేటాయించడంపై సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.