ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో గత 25 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ముగ్గురే సీఎంలు గుర్తుకు వస్తారని మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు గుర్తుకు వచ్చే సీఎంలలో చంద్రబాబు(Chandrababu), వైఎస్సార్(YSR), కేసీఆర్(KCR) ముందు వరుసలో ఉంటారన్నారు. చంద్రబాబు అంటే ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ గుర్తుకు వస్తుందని.. ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అంటే వైఎస్సార్ గుర్తుకువస్తారని.. కానీ ఈ రెండు కేసీఆర్‌లో కనిపిస్తాయని తెలిపారు.
కేసీఆర్‌ది అరుదైన సమతౌల్యం అని.. కాబట్టి ఆయనను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. కేసీఆర్(KCR)కు సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది కాబట్టి ముందుకు సాగుతున్నామన్నారు. నాడు రైతులు ఆస్తులు అమ్ముకున్నా అప్పులు కట్టలేని దుస్థితి ఉండేదని నేడు వారికి భూములే భరోసా అన్నారు. భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని వ్యక్తుల్లో ధీమా వచ్చిందని.. సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. కరోనా వల్ల రెండు సంవత్సరాలు వృథా అయిందని సరిగ్గా ఆరున్నర సంవత్సరాలు మాత్రమే తమ ప్రభుత్వం పనిచేయగలగిందని కేటీఆర్(KTR) వెల్లడించారు.