తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బేగంపేట(Begumpet) మెట్రో వరకు విపరీతమైన రద్దీలో నిల్చునే ప్రయాణించిన ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. కేటీఆర్ కూడా అందరికి ఓపికతో సెల్ఫీలిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు రోడ్ షోలు, సమావేశాలతో హోరెత్తిస్తున్న కేటీఆర్(KTR).. మరోవైపు యువతతో ముచ్చటించటం, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటీవల పాతబస్తీలో షాదాబ్ హోటల్‌కు కస్టమర్లను పలకరించి బిర్యానీ కూడా తింటూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఫేమస్ ఐస్‌క్రీమ్ స్పాట్ మొజంజాహి మార్కెట్‌కు వెళ్లి సందడి చేశారు.