తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే(Family Survey) మొదలైంది. దాంతో పాటుగా ఎన్యుమరేటర్లకు, ప్రజలకు మధ్య చిన్నపాటి గలాటాలు కూడా మొదలయ్యాయి. అసలు మా మతం ఎందుకు చెప్పాలని కొందరు ప్రశ్నిస్తుంటే, మా ఆస్తుల వివరాలు మీకెందకని మరికొందరు నిలదీస్తున్నారు. ఇంకొందరైతే ఎన్యుమరేటర్లు(Enumerators) వదలకుండా సమాచారం అడుగున్నారని వారిపైకి కుక్కలను కూడా వదిలిపెట్టిన ఘటనలు హైదరాబాద్‌లో తలెత్తాయి. దీంతో సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్తున్న ఎన్యుమరేటర్లు ఏం చేయాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సమాచారం ఇవ్వడానికి ప్రజలు నిరాకరిస్తుండటం, సరేలే అని వెనక్కు వెళ్తే పై బాస్‌లు చెడుగుడాడేస్తారన్న భయంతో బిక్కుబిక్కు మంటున్నారు ఎన్యుమరేటర్లు. ఈ పరిస్థితులపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్పందించారు. ప్రజలు నిశ్చింతగా తమ సమాచారం ఎన్యుమరేటర్లకు అందించొచ్చని, సమాచారం అంతా కూడా గోప్యంగానే ఉంటుందని అన్నారు.
‘‘87 వేల మంది ఎన్యుమరేటర్ల తో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వే చేయడం వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదు. ఎవరూ ఆందోళన చెందవద్దు. సమాచారం అంతా కూడా గోప్యంగా ఉంటుంది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల సర్వేకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిసింది. అది సరైన పద్దతి కాదు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి. మెరుగైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో ఈ సర్వే కీలక పాత్ర పోషించనుంది’’ అని పొన్నం ప్రభాకర్ వివరించారు. సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన అనంతరం ఆయన(Ponnam Prabhakar) ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుటుంబ సర్వే ఒక చారిత్రాత్మ ఘట్టమని పేర్కొన్నారు.