మంత్రి సీతక్క(Seethakka) ఈరోజు వెంగళరావు నగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థను సందర్శించారు. ఆమెకు విద్యార్థులు స్వాగతం పలికారు. విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి.. వారి యోగక్షేమాలు, వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సోనియా గాంధీ(Sonia Gandhi) పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కుటుంబానికి దూరంగా హాస్టళ్లలో ఉన్నా బాధపడొద్దని ధైర్యం చెప్పారు.
‘‘నేను కూడా హాస్టల్లోనే ఉండి చదువుకున్నాను. హాస్టల్లో ఎంతోమంది స్నేహితులు ఉంటారు. రకరకాల ఐడియాస్‌ను, సంతోషాన్ని, బాధని పంచుకోవచ్చు. ఒకరికొకరు చేయూతగా నిలవచ్చు. భవిష్యత్తును కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థానంలోకి ఎదగాలి. సాంకేతిక నైపుణ్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
స్కిల్ యూనివర్సిటీ ని ఇప్పటికే ప్రారంభించుకున్నాం. జాబ్ మార్కెట్ కు అనుగుణంగా ఉపాధి రంగాన్ని ఎంచుకోవాలి. లక్ష్యం తోటి ఈరోజు నుంచే అడుగులు వేయడం ప్రారంభించండి. లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు’’ అని వివరించారు సీతక్క(Seethakka).