ఖాళీ స్థలం ఉంటే అర్హులు ఎవరైనా గృహలక్ష్మి పథకానికి(Gruhalakshmi Scheme) దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని ప్రతిపక్షాలు, కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. మొదటి దశలో నియోజకవర్గానికి 3 వేల ఇళ్లుగా నిర్ణయించామని తెలిపారు. రెండో దశ గృహలక్ష్మికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు.
ఇల్లు లేని పేదలెవరూ ఆందోళన చెందవద్దని.. దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈనెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పిస్తారు. పదో తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను రెండోవిడతలో పరిశీలించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపికచేస్తారని తెలిపారు.