MLA Jagga Reddy |గత మూడ్రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. గత మూడురోజుల నుండి కురుస్తున్న భారీ వడగళ్ల వానకి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంట నష్టపరిహారం ఇవ్వాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అకాల వడగళ్ల వర్షం కారణంగా భారీగా పంటనష్టం జరిగిందని అన్నారు.
MLA Jagga Reddy |నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. కూరగాయల పంటకు రూ.35 వేలు, వరి పంటకు రూ.12 వేలు అలాగే నష్టపోయిన ఇతర పంటలకు పరిహారం ఇవ్వాలని కోరినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టపోయిందో విజిట్ చేయాలని మంత్రికి సూచించారు. అలాగే సొంత జాగ ఉన్నవారికి ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పింది.. ఈ అకాల వర్షాలకు రాష్ట్రంలో అనేకచోట్ల ఇండ్లు కూలిపోయాయిన వారికి కూడా ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న మంత్రి యోగక్షేమాలు తెలుసుకున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.