అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ భారీ షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఎల్లుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
‘కేసీఆర్(KCR) కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం. మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను’’ అని లేఖలో తెలిపారు.
కొద్దిరోజులుగా బీజేపీ(BJP) కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy). ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఆయన తన సొంత గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 2018లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో ఓడిపోయారు.
Read Also: నేనే సీఎం అవుతా.. టీకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat