గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న రచ్చ తీవ్రతరం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అధిక మార్కులు వేసి.. తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. గ్రూప్-1 పరీక్షలు, ఫలితాల విషయంలో అభ్యర్థులకు ఉన్న ప్రతి సందేహాన్ని నివృత్తి చేయాలని, ఆ బాధ్యత ప్రభుత్వం, టీజీపీఎస్సీదేనని(TGPSC) ఆమె పేర్కొన్నారు. పేపర్ల మూల్యాంకనం విషయంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న విషయం తన దృష్టికి వచ్చిందని, ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగా మూల్యాంకనం చేయలేకపోయారని అన్నారు. దాని వల్లే మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని కవిత వివరించారు.
గ్రూప్-1(Group 1) పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాట్‌టికెట్ నెంబర్, మెయిన్స్‌కు వేరే హాట్ టికెట్ నెంబర్ కేటాయించడం వల్లే మాల్యాంకనంలో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని అభ్యర్థులు అనుమానిస్తున్నాని చెప్పుకొచ్చారు. గ్రూప్-2 ఫలితాల్లో దాదాపు 13వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, వాటిని ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ 13వేల మందిని ఎందుకు ఇన్‌వాలిడ్‌గా ప్రకటించారని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు కవితను కలిసి చర్చించారు. ఈ క్రమంలోనే పరీక్షల ఫలితాలపై తమకున్న అనుమానాలను వారు కవితకు(MLC Kavitha) వివరించారు.