బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాదాపు 85 రోజుల తర్వాత ఎక్స్(ట్విట్టర్) యాక్టివ్ అయ్యారు. విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అందుకునేందుకు అదానీ గ్రూపు వేల కోట్ల రూపాయలు లంచాలు ఆఫర్ చేశారనే ఆరోపణలపై గౌతమ్ అదాని(Gautam Adani)తో పాటు మరో ఏడుగురిపైన అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు అదాని గ్రూపు 265 మిలియన్ డాలర్లు(2069 కోట్లు) ఇవ్వచూపినట్లు అమెరికా(America)లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. దీంతో వీరి అరెస్ట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ అంశంపై స్పందించడానికి కవిత మరోసారి ఎక్స్(ట్విట్టర్)లో యాక్టివ్ అయ్యారు. ఈ అంశంపై కవిత ఘాటుగా స్పందించారు. అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా ? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??’’అని ఆమె పోస్ట్ పెట్టారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 29న జైలు నుంచి విడుదలై తెలంగాణకు చేరుకున్న సందర్భంగా తండ్రి కేసీఆర్‌ను హత్తుకున్న ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె(MLC Kavitha) మరో పోస్ట్ ఏదీ పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ అదానీ అంశంపై పోస్ట్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.