MLC Kavitha meets CM KCR in Pragathi Bhavan: తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో విచారణ ముగిసిన అనంతరం ఆమె ప్రగతి భవన్ చేరుకున్నారు. సిబిఐ చేసిన విచారణను సీఎం కేసీఆర్ తో చర్చిస్తున్నారు. కాగా, ఈరోజు ఆమె నివాసంలో ఉదయం 11 గంటల మొదలైన సిబిఐ విచారణ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిబిఐ టీం… కవిత న్యాయవాది సమక్షములో స్టేట్మెంట్ రికార్డు చేసారు.
విచారణ కొనసాగిందిలా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియా, విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్, దినేష్ అరోరా తదితరులను ఇప్పటికే ప్రశ్నించిన సీబీఐ ఇందులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు భావించి వివరణ తీసుకోడానికి ఈ నెల మొదటివారంలో నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత(MLC Kavitha) నివాసానికి చేరుకున్నారు ఆరుగురు సభ్యులతో కూడిన CBI టీమ్. ఆమెను సీబీఐ అధికారులు దాదాపు 6 గంటలపైనే విచారించారు. విచారణ ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత కొద్దిసేపు లంచ్ బ్రేక్ తీసుకున్నారు. అనంతరం విచారణను మళ్ళీ మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారం సూర్యాస్తమయం సమయానికి విచారణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సీబీఐ అధికారులు విచారణ అసంపూర్తిగా ఉందని భావిస్తే.. ఇరు పక్షాల అభిప్రాయంతో మరో రోజున విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది.
ఢిల్లీ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీలోని అవకతవకలు, అవినీతి, రూపకల్పనలో జోక్యం, ఢిల్లీలోని ప్రైవేటు హోటల్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు వంటి అంశాలపై కవిత నుండి సీబీఐ వివరాలు సేకరించినట్లు సమాచారం. 10 వేల పేజీలతో ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్‌ను దాఖలు చేసినందువల్ల అందులోని అంశాలపై కూడా కవిత నుంచి వివరణ కోరడం ఈ విచారణలో భాగం. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత న్యాయవాది సమక్షంలో స్టేట్‌మెంట్‌ను సీబీఐ టీమ్ రికార్డు చేసింది.