లిక్కర్ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారుల విచారణపై తాను వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా చర్యలు తీసుకోమని చెప్పిన అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ఆమె తరపు న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించనుంది.
మరోవైపు రెండో రోజు విచారణలో భాగంగా కవిత, ఆమె భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక తొలి రోజు విచారణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. కాగా లిక్కర్ స్కాంలో అరెస్టైన కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. తిరిగి మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ హెడ్ క్వార్టర్స్‌లోనే కవితను అధికారులు విచారణ చేస్తున్నారు.