కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్‌ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి తిరోగమనం చెందిందని విమర్శించారు. ఏ అంశంపై ప్రశ్నించినా.. బీఆర్ఎస్ అప్పులు చేసి తప్పుకుందని, ఇప్పుడు ఆ వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయం సరిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు కవిత. తమ చేతకాని తనాన్ని బీఆర్ఎస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, రేవంత్(Revanth Reddy) తెగ కష్టపడుతున్నారని విమర్శించారు.
దృష్టి పెట్టాల్సిన అంశాలను అటకెక్కించి కేసీఆర్‌పై(KCR) ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తీరు ఉందని అన్నారు. దేని గురించి ప్రశ్నించినా.. బీఆర్ఎస్(BRS) చేసిన అప్పులే కారణమంటూ.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ బిజీ అయిపోయిందని, కానీ కాగ్.. అసలు రాష్ట్ర అప్పు ఎంతో స్పష్టంగా చెప్పిందని అన్నారు కవిత.
‘‘రూ.6500 కోట్లు వడ్డీ కడుతున్నం అని అబద్ధాలు చెప్పారు. చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. రాష్ట్రానికి రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. రూ.12వేల కోట్ల ఆదాయం వస్తుంది అని కాగ్ చెప్తుంది. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా. హైడ్రా(Hydra) తో దారుణంగా రాష్ట్ర ఆదాయం 5వేల కోట్ల వరకు పడిపోతుంది. హై కోర్టు హెచ్చరిస్తున్నా కూల్చివేతలు ఆపడం లేదు. కొత్త విషయాలు ఏవీ మోడీ తో మాట్లాడలేదు’’ అని MLC Kavitha అన్నారు.