లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆమెను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కవితను కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ స్కాంలో కవిత ప్రధాన సూత్రధారి అని.. ఆమెను విచారించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఆమెను తిహార్ జైలు(Tihar Jail) నుంచి సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించి ప్రశ్నించనున్నారు.
విచారణ సందర్భంగా సీబీఐ కస్టడీ పిటిషన్‌లో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి కవిత రూ.100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో తెలిపింది. అలాగే కవిత నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థకు అప్రూవర్ శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అంతకుముందు సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. కాగా మనీలాండరింగ్ కేసులో ఈడీ తరపున అరెస్టైన కవిత(MLC Kavitha) ప్రస్తుతం తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.