జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థినిలు వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. కాగా వారికి ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు నిర్ధారించారు. తాజాగా ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనమే కారణమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మండిపడ్డారు.
పిల్లలు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని, ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఏమాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కావడం పరిపాటిగా మారిపోయిందని, అయినా సీఎం సైలెంట్‌గా ఉండటం దారుణమని MLC Kavitha విమర్శించారు.
సంబంధిత అధికారులు కూడా ఈ ఘటనలపై ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆగ్రహం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులన్నీ కూడా కాగితాలకే పరిమితమైనట్లేనా అని నిలదీశారు.
‘‘జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవ్వడంతో, సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో వారి పిల్లల క్షేమం పట్ల భయాందోళన నెలకొంది. కనీసం పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా మారింది.
విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సంక్షేమ పాఠశాలలకు వెళ్లి అక్కడి పరిస్థితులను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంక్షేమ పాఠశాలలను సందర్శించాలి. వాటి పరిస్థితులపై సమీక్ష చేసి ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి’’ అని కవిత కోరారు.