లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో కవితను హాజరుపర్చారు. విచారణ సందర్భంగా ఈడీ తరపున జోయబ్ హుస్సేన్ వర్చూవల్‌గా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నామని.. మరో 15 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరారు.
అయితే ఇప్పటికే 10 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినందున ఇకపై కుదరదని స్పష్టంచేసిన న్యాయస్థానం ఆమెకు ఏప్రిల్ 9వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు తెలిపింది. కోర్టు ఆదేశాలతో కవితను తిహార్(Tihar Jail) జైలుకు తరలించారు. మరోవైపు పిల్లలకు పరీక్షలు ఉన్నందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో కవిత పిటిషన్ వేశారు. వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 1న విచారణ చేపడతామని పేర్కొంది.
అంతకుముందు కోర్టులో హాజరయ్యే సమయంలో కవిత(MLC Kavitha) మీడియాతో మాట్లాడుతూ ” కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు బీజేపీలో చేరారు. మరో నిందితుడు బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారు. అలాగే మూడో నిందితుడు బీజేపీకి రూ.50కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు ఇచ్చారు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.