ఎంఎంటీఎస్ సేవలను(MMTS Services) యాదాద్రి వరకు పొడిగించడం తథ్యమని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు విస్తరించి తీరుతామని వెల్లడించారు. ఇప్పటి వరకు దక్షిమధ్య రైల్వే పరిధిలో 90శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని, ఇందులో కూడా దక్షిణ మధ్య రైల్వే తన మార్క్ చూపుతోందని చెప్పుకొచ్చారు. రూ.650 కోట్ల వ్యయంతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వేస్ బడ్జెట్‌ను పెంచిందని వివరించారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ సేవలు(MMTS Services) అందుబాటులో ఉన్నాయని, వీటిని యాదాద్రి వరకు పెంచడమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం పంచుకుంటే మంచిదేనని, అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని చెప్పినా.. ఎంఎంటీఎస్ సేవలను యాదాద్రి వరకు పొడిగించి తీరుతామని స్పష్టం చేశారు.
‘‘దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) పరిదిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న కాలంలో వీటి సంఖ్యను గణనీయంగా పెంచనున్నాం. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు చేస్తున్నాం. వచ్చే ఏడాది అంటే 2025 డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తవుతుంది. అందులో భాగంగానే ఎంఎంటీఎస్ సేవలను కూడా యాదాద్రికి చేరేలా చేస్తాం. అందులో సందేహం అక్కర్లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు. కొన్ని రోజుల క్రితమే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగింయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ గురించి కూడా పలు కీలక విషయాలు వెల్లడించారు.