టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మోత్కుపల్లి మండిపడ్డారు. తాజాగా బాబు అరెస్టును నిరసిస్తూ దసరా పండుగను జరుపుకోకుండా తన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉండాల్సింది కిరాతకులని కానీ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబు లాంటి నాయకుడు కాదన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారని మిగిలిన వారు కూడా జైలుకు వెళ్లాలా? అని ప్రశ్నించారు.
జగన్.. గుర్తుపెట్టుకో ఇక నీ ఆటలు సాగవు..
చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే అందరూ బాధపడుతున్నారని తెలిపారు. వ్యవస్థలను మెనేజ్ చేస్తూ చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా?అని ప్రశ్నించారు. జగన్ అరాచకం కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కూడా ఇన్ని కుట్రలు జరగలేదన్నారు. జగన్.. గుర్తుపెట్టుకో ఇక నీ ఆటలు సాగవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని సమాధి చేయడం ఖాయమని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్‌తో పాటు అనేక మంది దళితులను చంపిన పాపం జగన్‌దే అని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం..
ఇక తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నారు. ఎవరు కాదన్నా..ఔనన్నా.. రేవంత్ వలనే కాంగ్రెస్ బలపడిందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎన్టీఆర్, చంద్రబాబు(Chandrababu) హాయాంలోనే మాదిగలకు న్యాయం జరిగిందని.. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కావటం లేదన్నారు. దళితబంధు పథకం పేరుతో తనను పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ మోసం చేశారని మోత్కుపల్లి(Motkupalli Narasimhulu) ఫైర్ అయ్యారు.