MP Arvind | ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ స్పీడు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు చేరికలపై దృష్టి పెట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని, ఇదే క్రమంలో సోషల్ మీడియాను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కేసీఆర్ సర్కార్ అవినీతిని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రోజూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.