లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కరి తర్వాత ఒక్కరూ పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, నాగర్ కర్నూలు ఎంపీ రాములు(MP Ramulu) పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కారు దిగేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీకి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు.
కాగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ ఎంపీగా విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇలా వరుసగా ప్రముఖ నేతలు పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ.. ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలవాలనే పట్టుదలదో ఉన్నాయి. దీంతో గులాబీ నేతలకు గాలం వేస్తున్నాయి. ఈ రెండు పార్టీల దెబ్బకు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.