తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం వరుసగా ప్రిలిమ్స్ పరీక్షలు సైతం నిర్వహిస్తోంది. ఇప్పటికే పోలీసు నియామకం తుది దశకు చేరుకోగా.. గ్రూపు-1, గ్రూపు-4 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్ల(TS Guest Lecturers) నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఇంటర్మీడియెట్ కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం (జులై 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన నియామక మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల(TS Guest Lecturers)కు ఒక్కో పీరియడ్‌కు నిమిత్తం రూ.390 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన నెలకు రూ.28,080 చొప్పున వేతనం అందించనున్నట్లు వెల్లడించింది.