New Controversy In Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు చల్లారడం లేదు. పీసీసీ కమిటీల నియామకం విషయంలో ఇప్పటికే బహిరంగంగా గళం విప్పుతున్న అసమ్మతి నేతలు తాజాగా శనివారం సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, ఉత్తమ్, జీవన్ రెడ్డి, గీతారెడ్డితో పాటు మరికొంత మంది ఈ మీటింగ్ కి హాజరైనట్టు తెలుస్తోంది.
టీపీసీసీ కమిటీల ఎంపికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు సీనియర్లు. పార్టీ పదవులు తమను కాదని జూనియర్లకు కట్టబెట్టారని, ఎప్పుడు గాంధీ భవన్ మెట్లు ఎక్కని వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని అంసతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, భట్టి విక్రమార్క, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కమిటీల మార్పు పై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో తాజా భేటీ టీ కాంగ్రెస్(Telangana Congress Party) లో ఆసక్తిగా మారింది. కమిటీల కూర్పు విషయంలో ఏఐసీసీకి లేఖ రాయాలా? లేక నేరుగా మల్లికార్జున ఖర్గేను కలిసి పరిస్థితి వివరించాలా? అనే విషయంపై నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అసంతృప్త నేతలంతా టీపీసీసీ రేవంత్ రెడ్డి వైపే వేలు చూపిస్తుండడం చర్చగా దారితీస్తోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అసలే నానాటికి పార్టీ పరిస్థితి దిగజారిపోతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోని సీనియర్ల అసంతృప్తి ఎటువైపు దారితీస్తుందో అనే చర్చ ఆసక్తిగా మారింది.