బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) శనివారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి బీఆర్ఎస్ లో సీఎం అభ్యర్థిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు.. కేసీఆర్ కుటుంబంలో సీఎం అభ్యర్థిత్వం కోసం గొడవలు జరుగుతున్నాయి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కవిత, కేటీఆర్ ల మధ్య కుర్చీ కోసం బలమైన పోటీ నడుస్తుందని, ఇంట్లో సమస్యలు తీర్చుకోలేని వాళ్ళు ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
సిరిసిల్ల(Sircilla) పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ విమర్శలపై స్పందిస్తూ.. కేసీఆర్ ఉన్నంతకాలం ఆయనే సీఎం అని తేల్చి చెప్పారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం చేతకాక ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా తిరిగి కేసీఆర్ సీఎం అవడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన ఆరు గ్యరెంటీల్లో(6 Guarantees) కాంగ్రెస్ అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వాటిని డైవర్ట్ చేసేందుకు కేసులు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.