ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితురాలిని శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. అత్యాచారయత్నం నుండి తప్పించుకునేందుకు ట్రైన్ నుండి కిందకి దూకినట్లు పేర్కొన్నారు. బస్సులో, ట్రైన్స్ లో మహిళల పట్ల భద్రత లోపించిందని వారు అన్నారు. బాధితురాలికి దంతాలు మొత్తం ఊడిపోయాయని ఇప్పటికి డెంటల్ డాక్టర్ రాలేదని అన్నారు. ఆమెకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ లో వైద్యం అందించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండి మహిళలకు భద్రత కరువైందని మండిపడ్డారు. షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల కెమెరాలను మానిటరింగ్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసుకున్నాం. కానీ, ప్రస్తుతం పర్యవేక్షణ కరువైందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు కావాల్సింది భద్రత కానీ, అందాల పోటీలు కాదని శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వం ఆలోచన చేయాలనీ సూచించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మహిళలకు భద్రత పెంచాలని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని కోరారు.