అదానీ లంచాల వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో అదానీ(Adani) చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) డ్రీమ్ ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం అదానీ రూ.100 కోట్ల విరాళం ఇవ్వడంపైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్‌కు అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు విరాళమేనా లేదా లంచమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా అదానీ లంచం వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే కెన్యా వంటి చిన్న దేశం కూడా అన్ని ఒప్పందాలను రద్దు చేసుకుందని, ఆ ధైర్యం తెలంగాణ ప్రభుత్వం చేయలేకపోతోంది ఎందుకంటూ ప్రశ్నించారు.
ఈరోజు కేటీఆర్(KTR) ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్వీకరించడం లేదని వెల్లడించారు. ‘‘అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు తీసుకుందంటూ కొందరు విష ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు.
అదే విధంగా అంబానీ, టాటా, అదానీ వాళ్లు కూడా తెలంగాణలో వ్యాపారం చేసుకోవచ్చు. అదానీ నుంచి ఏ ప్రాజెక్ట్‌ను అయినా చట్టబద్దంగానే పెట్టుబడులకు అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్ట్‌లు ఇస్తున్నాం. సీఎస్ఆర్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ మేరకు అదానీ గ్రూప్‌కు లేఖ కూడా పంపాము’’ అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు.