ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీలోకి వెళ్లి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) పేరు ప్రకటించిన రోజునే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. కానీ ఇంతలోనే ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు.
గతేడాది కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పది వేల మెజారిటీతో ప్రభాకర్ గెలుపొందగా.. స్రవంతి డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి(Chalamala Krishna Reddy) కూడా ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ తరపున ఆయన మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డిపై పోటీచేస్తున్నారు.