లగచర్ల(Lagacharla)లో కలెక్టర్‌పై దాడి ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే తన భర్త అరెస్ట్‌కు వ్యతిరేకంగా పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) భార్య పట్నం శృతి రెడ్డి(Patnam Sruthi Reddy).. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గాలికొదిలేస్తూ పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు.
అందుకుగానూ పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ నా భర్తను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. కావున నా భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’’ అని పట్నం శృతి కోరారు.
అయితే ఫార్మా సిటీ ఏర్పాటు భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Prateek Jain) సహా పలువురు అధికారులు ఇటీవల లగచర్ల, పోలేపల్లి ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ వారికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, రైతులు.. కర్రలు, రాళ్లతో దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు కనుగొన్నారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్, సురేష్ పదుల సంఖ్యలో ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పట్నం నరేందర్(Patnam Narender Reddy)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.