తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా ఇక నుంచి జాతీయ నేతలు రంగంలోకి దిగనున్నారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో పార్టీ అగ్రనేతలు ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారుచేశారు. ఏప్రిల్ 30వ తేదీతో పాటు మే 3,4వ తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీన హైదరాబాద్ నగరంలో వివిధ రంగాల్లో ప్రముఖలతో మోదీ సమావేశం అవుతారు. అనంతరం అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే సభతో పాటు.. భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటుచేసే సభల్లో పాల్గొంటారు. ఇక 4వ తేదీన మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఏప్రిల్ 25న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.