హయత్‌నగర్(Hayath Nagar)లో 108 వాహనం దొంగలించబడిన విషయం హల్‌చల్ రేపింది. అసలు అంబులెన్స్(Ambulance) దొంగలించడం ఏంటని స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆలోచనలో పడిపోయారు. ఇంతలో ఆ దొంగ సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని పట్టుకోవడం కోసం సినిమా రేంజ్ ఛేజ్ చేశారు.
అంబులెన్స్ కొట్టేసిన దొంగ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై ఉన్నట్లు తెలియడంతో పోలీసులు కూడా హైవేపైకి వెళ్లారు. అది గమనించిన దొంగ సైరన్ మోగిస్తూ విజయవాడ వైపు పరారయ్యాడు. చిట్యాల దగ్గర దాదాపు పోలీసులు పట్టేసుకున్నారన్న సమయంలో ఓ వ్యక్తిని ఢీకొట్టి తప్పించుకున్నారు. ఆ తర్వాత కేతేపల్లి మండలం కోర్లపహాడ్(Korlapahad) లోట్‌గేట్ దగ్గర గేట్ ఢీకొట్టుకుంటూ అంబులెన్స్ పోనించేశాడు దొంగ.
కాగా చివరకు టేకుమట్ల దగ్గర రోడ్డుపై లారీలను అడ్డుగా పెట్టి దొంగను పట్టుకున్నారు పోలీసులు. నిందితుడిపై గతంలో కూడా పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం దొంగ ఢీ కొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దొంగను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అంబులెన్స్(Ambulance)ను ఎందుకు దొంగలించాడన్న విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.