ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) పై పోలీసు కేసు నమోదైంది. మంగళవారం రాత్రి లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా.. సమయం అయిపోయిందని ప్రచారం ముగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న సంతోష్‌నగర్ సీఐ శివచంద్ర అక్బరుద్దీన్‌ని కోరారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. తన వద్ద కూడా వాచీ ఉందని ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని మండిపడ్డారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. తాను కనుసైగ చేస్తే చాంద్రాయణగుట్ట నుంచి పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, తనలో అదే దమ్ము ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) వ్యాఖ్యలను ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమర్థించారు. రాత్రి 10గంటలకు ఐదు నిమిషాల ముందు ప్రసంగం ఆపమని ఏ చట్టం చెప్పిందని ఆయన ప్రశ్నించారు. సమయం ఉన్నా పోడియం పైకి పోలీసులు ఎందుకు వచ్చారు.. చివరి ఐదు నిమిషాలు ప్రసంగంలో చాలా ముఖ్యమని అసదుద్దీన్ తెలిపారు.