Phone Tapping Case | ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలంగాణ అంతటా సంచలనంగా మారుతోంది. దీని వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం శపథం చేసింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కూడా వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును విదేశాల నుంచి భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ అరెస్ట్ అనివార్యంగా భావించిన నిందితులు ఇద్దరూ అమెరికాకు పరారయ్యారు. అప్పటి నుంచి వారిని స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అమెరికాలో ఉన్న వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు ఇంటర్‌పోల్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు.
భారత్, అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ప్రభాకర్, శ్రవణ్‌లను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు న్యాయస్థానికి విన్నవించారు. ఇదే అంశంపై నేషనల్ సెంట్రల్ బ్యూరో, సీబీఐ అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు దర్యాప్తు బృందం వివరించింది. వారిని వీలైనంత త్వరగా తిరిగి తీసుకొచ్చి ఫోన్ టాపింగ్ కేసులో విచారణ జరపాలను పోలీసులు భావిస్తున్నారు. వీరితో పాటుగా ఈ కేసు(Phone Tapping Case)లో పాత్ర వహించిన మరికొందరు రాజకీయ నాయకుల పేర్లను కూడా సంపాదించినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. వారిని కూడా త్వరలోనే విచారణకు పిలవబోతున్నట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి పలు కీలక విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అందులో అసలు ఈ వ్యవహారం వెనక ఉన్న మాస్టర్ మైండ్ కూడా తెలిసే అవకాశం ఉందని దర్యాప్తు బృందం పేర్కొంది.