Ponguleti Sudhakar Reddy campaigning in Surat Telugu people on behalf of BJP: గుజరాత్ విధానసభ ఎన్నికలు డిసెంబర్ 15న రెండు దఫాలుగా జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం భారతీయ జనతాపార్టీ గుజరాత్‌లోని నగరాలైన సూరత్, వడోదర, వాపి ప్రాంతాల్లో.. యూపీ, బీహార్, అస్సాం తెలంగాణ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని, ఆయా రాష్ట్రాల నుంచి ప్రచారం నిమిత్తం తెలంగాణ బీజేపీ నాయకులను గుజరాత్‌కు రప్పిస్తున్నారు. కేవలం ఒక్క సూరత్‌లోనే 50వేల మంది ఓటర్లు ఉన్నారు. బోర్యాసి, లింబాయత్, ఉధునా మజురా విధాన సభ ప్రాంతంలో ఈ తెలుగు వారు అధికంగా నివసిస్తున్నారు. ఈ ఓటర్లను ఆకర్షించేందుకు పొంగులేటి సుధాకర్ రెడ్డిని బీజేపీ రంగంలోకి దించింది.
ఈ నేపథ్యంలో సూరత్ నగరానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి విచ్చేశారు. తమ ప్రాంత నాయకుడిని చూసేందుకు సంత్తిలో సహజానంద్ సొసైటీలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారా సభకు పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఎటువంటి మత అల్లర్లు జరగలేదని గుర్తు చేశారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర దేశాల్లో సైతం మన దేశ కీర్తిని పెంచారన్నారు. దేశం సుస్థిరం అవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, కుటుంబ పాలనే కనిపించేదని విమర్శించారు. ఆమ్‌ఆద్మి పార్టీ ఉచిత హామీ ఇస్తుందనీ.. వాటిని నమ్మవద్దని సూచించారు. బీజేపీ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనీ, బీజేపీకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అక్కడ ఉన్న తెలుగు ఓటర్లను పొంగులేటి (Ponguleti Sudhakar Reddy) కోరారు. కాగా.. లింబాయత్ విధాన సభ నుంచి శ్రీమతి సంగీత పటేల్, బోర్యాసి నుంచి శ్రీ సందీప్ దేశాయ్, మధుర నుంచి హర్ష సంఘ్వీ, ఉధున నుంచి శ్రీ మను పటేల్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ సభలో తెలుగు నాయకులు రాపోలు బుచ్చిరాములు, చిట్యాల రాము, ఎలిగీటి నాగేష్, దుస్సా ఉపేందర్, తుమ్మ రమేష్, కోదునూరి శ్రీనివాస్, నర్సి అరికల్ గరిదాసు, వెంకట నారాయణ, దాసరి శ్రీనివాస్, కార్పొరేటర్ శ్రీమతి ఎనగందుల కవిత, స్థానిక నగర వాసులు డాక్టర్ రవీందర్ పటేల్, వినయ్ శుక్లా, రఘురాజ్ సింగ్, చెన్నూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు
సూరత్‌లో మెుదటి నుంచి తెలుగు ప్రజలు బీజేపీ వైపే మెుగ్గు చూపుతున్నారు. సూరత్ నగరంలోని కార్పొరేషన్‌లో తెలుగు వారు కూడా కార్పొరేటర్లుగా పని చేశారు. సూరత్ ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలోనే తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది.