కేటీఆర్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన అమృత్ పథకం టెండర్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికే వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో తనపై పెరుగుతున్న కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్(KTR).. హస్తినకు ప్రయాణమయ్యారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
‘‘ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. కార్ రేసింగ్‌కి డబ్బులు ఇచ్చామని స్వయంగా కేటీయారే చెప్తున్నారు. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలి. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేయడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైన కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిది. అమృత్ పథకంలో అక్రమాలంటూ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము’’ అని తెలిపారు.
‘‘రవాణా శాఖలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 113 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్‌లో వినియోగిస్తాం. ఢిల్లీకి వెళ్లి అమృత్ పథకం మీద ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. కార్ రెస్‌కు సంబంధించి ఇటీవలే గవర్నర్ అనుమతి కోరాము. మేము ఎవరిని జైల్లో పెడతాం అనడం లేదు. తనను తాను రక్షించుకేనేందుకు కేటీఆర్(KTR) కేంద్రం వద్ద మోకరిల్లెందుకు వెళుతూ…ప్రజల దృష్టిని మరల్చుతున్నారు. అమృత్ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. కానీ మీ మీద జరిగే విచారణను ఆపుకునేందుకు వెళుతున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. విచారణకు సహకరించి మీ చిత్త శుద్ధి నిరూపించుకొండి’’ అని కేటీఆర్ కు Ponnam Prabhakar ఛాలెంజ్ చేశారు.