భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగులో మాట్లాడలేకపోతునందుకు శింతిస్తూ హిందీలోనే మాట్లాడతానని అన్నారు. దేశంలోనే అతి భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. దేశంలో కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు. ఆ మహనీయుడి జయంతిని చాలా ప్రత్యేకంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాలని సూచించారు. దేశంలో ఆర్థిక అసమానతలపై ఆనాడే అంబేద్కర్ ఫైట్ చేశాడని గుర్తుచేశారు.
ఆయన స్పూర్తితో మళ్ళీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని కాపాడేందుకు ఫైట్ చేసేందుకు కేసీఆర్ దిశ మొదలుపెట్టారని అన్నారు. దేశంలో ఒక్క రిలీజియస్ మైనార్టీ మాత్రమే లేదు.. కమ్యూనిటీ మైనార్టీ కూడా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబందు పథకం(Dalitha Bandhu Scheme) మంచి పథకమని శుభాకాంక్షలు చెప్పారు. దళితబందు ఫలితం రానున్న రోజుల్లో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్(KCR) ప్రారంభించిన దళితబంధులను రానున్న రోజుల్లో మరికొంత మంది ముఖ్యమంత్రులు ప్రారంభించబోతున్నారని అన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని ప్రకాశ్(Prakash Ambedkar) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.. అది నెరవేరాలని కోరుకుంటున్నా అని తెలిపారు.