Bharat jodo yatra: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోకి జోడో యాత్ర (Bharat jodo yatra) ప్రవేశించింది. ఈ సందర్భంగా కృష్ణ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించిన సమయంలో.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకున్నారు.
తెలంగాణలోకి పాదయాత్రగా వచ్చిన రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి సుమారు 3 కి.మీ మేర పాదయాత్రను రాహుల్ కొనసాగించారు.. అనంతరం రాహుల్ ఢిల్లీ బయలుదేరారు. దీపావళి, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్డే ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా 24,25,26 తేదీల్లో రాహుల్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రను సమన్వయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అక్టోబరు 27న ఉదయం గూడెంబెల్లూరు నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 12 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర గాంధీ పాదయాత్ర చేయనున్నారు.
Read also: భార్యా భర్త చికెన్.. మధ్యలో పక్కింటాయన