Rajagopal reddy: మునుగోడు నియోజకవర్గం ఏమైనా అనాథనా అని మునుగోడు ఉప ఎన్నిక(munugode bypoll) బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని 600 మద్యం దుకాణాల్లో వాటా ఉందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితతో పాటు, కేసీఆర్ హస్తం కూడా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.
కవిత అవినీతిపై ఇప్పటికై సీబీఐ విచారణ జరుగుతోందనీ.. వచ్చే బతుకమ్మ వేడుకలను ఆమె తీహార్ జైలులోనే జరుపుకోవాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ ప్రకటనపై రాజగోపాల్ రెడ్డి((Rajagopal reddy) మండిపడ్డారు. మునుగోడు వీర భూమి అనీ.. దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించటానికి, నిధులు కేటాయిస్తే చాలని.. కేటీఆర్‌కు సూచించారు. మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనుందనీ.. ప్రజలు ఆషామాషీగా తీసుకోవద్దని కోరారు. ప్రజలు ధర్మం వైపు నిలబడి బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. కేసీఆర్ నియంత పాలనను అంతమెుందించే వరకు పోరాడుతూనే ఉంటాను అంటూ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.