లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హస్తం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. కాగా గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 ఎమ్మె్ల్యే సీట్లు రాగా.. మిత్రపక్షం సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగింది.