ప్రజా యుద్ధ నౌక మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్(Gaddar) ఇక లేరన్న వార్త విని తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన ఆకస్మిక మరణవార్త తెలుసుకున్న విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండ్రోజుల కిందటే అపోలో ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ విజయవంతం అయిందని తెలియడంతో అందరూ సంతోషపడ్డారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారు అనుకుంటూనే లోపే దుర్వార్త వినాల్సి వచ్చింది. ఆపరేషన్ సక్సెస్ అయినా ఇంత అకస్మాత్తుగా ఎలా చనిపోయారని జనాలు చర్చించుకుంటున్నారు. దీనిపై అపోలో వైద్యులతో పాటు ఆయన కుటుంబీకులు ప్రకటన విడుదలు చేశారు.
‘గద్దర్(Gaddar) తీవ్రమైన గుండె వ్యాధితో జూలై20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేశాం. ఆపరేషన్ నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు’ అని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయని.. మధ్యాహ్నం అవయవాలన్ని దెబ్బతిన్నాయని గద్దర్ కుటుంబీకులు పేర్కొన్నారు. గద్దర్ మరణంతో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రజల సందర్శనార్థం గద్దర్ భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఎల్బీ స్టేడియం కి తరలించనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజానీకం, విప్లవకారులు, ఉద్యమకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.