చాలా కాలం తర్వాత అమీన్‌పుర్‌కు అరుదైన అతిథి విచ్చేశారు. ఆయన రాక ప్రకృతి ప్రియులు, పర్యాటకులతో పాటు ప్రభుత్వ దృష్టిని కూడా ఆకర్షించింది. అదెవరో కాదు.. అరుదుగా కనిపించే ‘రెడ్ బ్రెస్ట్‌డ్ ఫ్లైక్యాచర్’ అనే పక్షి. అమీన్‌పుర సరస్సు(Ameenpur Lake)లో చాలా కాలంగా ఈ పక్షి కనిపించిన జాడ లేదు. 12 సెంటీమీటర్లు ఉండే ఈ పక్షి ఇటీవల మళ్ళీ దర్శనమివ్వడం విశేషంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రకృతిని మనం కాపాడితే.. మనల్ని ప్రకృతి కాపాడుతుందని నేను ఎల్లప్పుడు నమ్మాను. ఇది ఒక రైతు జ్ఞానం. ఏళ్ల తరబడి ఆక్రమణలు, కలుషిత నీరుతో వినాశనానికి గురైన మన జలవనరులను కాపాడాలని నిశ్చయించుకున్నాం. చెరువులు, కుంటలను ఆక్రమణలను అడ్డుకున్నాం. కొన్ని నెలల్లోనే మన పర్యావరణ సంపద, వారసత్వాన్ని విజవంతంగా పెంపొందించాం.
అతి తక్కువ సమయంలోనే ప్రకృతి మనకు రివార్డ్ కూడా ఇచ్చేసింది. హైడ్రా పునరుద్దరించిన సరస్సులో 12 సెంటిమీటర్ల రెడ్-బ్రెస్ట్‌డ్ ఫ్లైక్యాచర్ తిరిగి కనిపించింది. ఇది ఆ దేవుడి బహుమతి, మనకు ఆయన ఇచ్చిన ఆమోదంగా భావిస్తున్నా’’ అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.
12 సెంటిమీటర్లు ఉండే ఈ పక్షి సాధారణంగా తూర్పు ఐరోపా నుంచి మైగ్రేట్ అవుతాయి. తూర్పు ఐరోపాలో ఏర్పడే అత్యధిక చలి నుంచి కాపాడుకోవడం కోసం పుష్కలంగా ఆహారం లభిస్తూ.. మోస్తరు ఉష్ణోగ్రతలు ఉండే దక్షిణ ఆసియా వంటి ప్రాంతాలకు ఇవి వలసలు వెళ్తుంటాయి.
దీంతో ఈ పక్షులకు హైదరబాద్ అమీన్‌పుర్ ఆవాసమవుతోంది. అయితే అమీన్‌పుర్ సరస్సు(Ameenpur Lake) అనేక అరుదైన పక్షులకు ఆవాసంగా ఉండేది. ఇక్కడకు ఫ్లెమింగోస్ సైతం వచ్చేవి. కానీ పలు కారణాల కారణంగా సరస్సు పరిసరాలు మారిపోవడంతో ఈ పక్షులు ఇక్కడకు వలస రావడం మానేశాయి. ఇప్పుడు హైడ్రా పుణ్యమా అని అవి మళ్ళీ హైదరాబాద్ బాట పట్టాయి.