మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) విజయంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి వారి తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ చేతగాని తనంతోనే బీజేపీ పురోగతి సాధించిందని విమర్శించారు.
‘‘మహారాష్ట్ర(Maharashtra) ఓటమితో కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుంది. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుందని భావించినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేట తెల్లమయింది’’ అని అన్నారు కేటీఆర్.
‘‘బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కేవలం కాంగ్రెస్ చేతగాని, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుంది. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరు’’ అని కేటీఆర్(KTR) ధీమా వ్యక్తం చేశారు.