తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్(Sirpur Kagaznagar) పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులపై దాడి చేసి, డబ్బులు తీసుకున్నారని ఈ కేసులు నమోదుచేశారు. దీంతో ఈ కేసులపై ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్‌ఎస్పీ పోటీ చేస్తున్నారు.
అంతకుముందు ఈ కేసులపై ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) తీవ్రంగా స్పందించారు. కాగజ్‌నగర్ పోలీసులు తనపైనా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్ అయిన తన కుమారుడితో పాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ సభ్యులపైనా హత్యాయత్నం(సెక్షన్ 307) కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కనుసన్నల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని కోనప్ప డ్రైవర్ ఫిర్యాదు చేశాడన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అందులోనూ 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు.