పాక్షికంగా కూలిపోయిన శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగంలో మానవ అవశేషాల జాడలను సహాయక బృందాలు కనుగొన్నాయి. ఇతర సంస్థల కార్మికుల సహాయం తో NDRF బృందాలు, క్యాడవర్ డాగ్స్(Cadaver Dogs), భూకంప శాస్త్ర అధ్యయనాల ద్వారా గుర్తించబడిన రెండు ప్రదేశాలలో పని చేస్తూ, కార్యకలాపాలలో పురోగతిని సాధించాయి. తప్పిపోయిన కార్మికులలో తీవ్రంగా దెబ్బతిన్న ఒకరి అవశేషాలుగా అనుమానించబడిన వాటిని వారు వెలికితీశారు. అవశేషాలను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బృందాలు ముందుకు వెళ్లేందుకు చేస్తున్న మాన్యువల్ తవ్వకాలు నెమ్మదించాయి. కేరళ నుండి వచ్చిన క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండవ ప్రదేశంలో తవ్వకం పనులు కూడా రెండు గంటలు పట్టవచ్చని భావిస్తున్నారు.
సొరంగం(SLBC) లోపల ఉన్న కఠినమైన పరిస్థితులు, చెత్త, నీరు, భారీ శిథిలాలు, రెస్క్యూ ఆపరేషన్‌ను చాలా కష్టతరం చేశాయి. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ రెస్క్యూ బృందాలు తమ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాయి. మానవ ఉనికిని గుర్తించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సహాయక చర్యల పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల తొలగింపులో సహాయపడటానికి, సహాయక సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి మార్చి 11 నుండి రోబోలను మోహరించాలని అధికారులు ప్రణాళిక వేశారు. రెస్క్యూ బృందాలు తమ పనిని కొనసాగిస్తున్నందున, కార్యకలాపాలు కీలక దశకు చేరుకున్నాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు నిర్దిష్ట ప్రదేశాలలో బాడీలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.