తెలంగాణ వ్యాప్తంగా ఫార్మా సిటీ కోసం లగచర్ల(Lagacharla)లో చేపట్టిన భూసేకరణ అంశం కీలకంగా మారింది. పచ్చని పొలాలు లాక్కుని ఫార్మా సిటీ నిర్మిస్తారా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరించడానికి వెళ్లిన కలెక్టర్ సహా పలువురు ఇతర అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతలో లగచర్లలో నిర్మించేది ఫార్మా సిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. అయినా సరే ఈ వ్యవహారం చల్లారకపోవడంతో తాజాగా దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లగచర్ల(Lagacharla) విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. లగచర్లలో చేపట్టిన భూసేకరణను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఫార్మా విలేజ్‌లకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఈ ఏడాది ఆగస్టు 1న ప్రభుత్వం విడుదల చేసింది.