Revanth Reddy allegations on CM KCR: తెలంగాణ రాష్ట్రం కోసం మెుదట ఆత్మబలిదానం చేసిన మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతిని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం, రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అంటే మెుదటగా గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు.
సమాజానికి చెదలు పట్టినప్పుడు, అధికారం, ఆధిపత్యం కోసం ఆలోచించినప్పుడు.. నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ దొంగ దీక్ష చేశారనీ.. ఖమ్మ ఆసుపత్రిలో నిమ్మరసం తాగారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎవరు అమరులయ్యారు.. ఎవరు ఉద్యమంలో కొట్లాడారు.. జేఏసీలు పెట్టిందెవరు.. జెండాలు కట్టిందెవరు.. అధికారం, ఆధిపత్యం చెలాయిస్తోంది ఎవరు అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలదీశారు.
తెలంగాణ బిడ్డల పోరాటాన్ని చూసి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రమిస్తే.. పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా.. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలకు ఉద్యోగం, పది లక్షలు ఇస్తామంటే.. రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపినట్లు వివరించారు. కానీ అమరులైన కుటుంబాలకు ఇప్పటికీ ఎటువంటి సాయం చేయలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.