గత పాలకుల పరిపాలనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్పుతో తెలంగాణ తిరిగి అభివృద్ధి బాటలోకి అడుగు పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. శుక్రవారం నారాయణపేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం నారాయణ పేట(Narayanpet)లో నిర్వహించిన “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు రేవంత్. పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? ఎక్కడైనా ఎప్పుడైనా తాము చర్చకు రెడీ అని అన్నారు రేవంత్ రెడ్డి.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన బాగోలేదని, అన్నీ లోపాలు, అవకతవకలేనని అంటున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్(KCR), 12 ఏళ్ల ప్రధానిగా ఉన్న మోదీ(Modi) అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12 నెలల నుంచి పాలన సాగిస్తోంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) చర్చకు వస్తే సీఎంకు చర్చించడానికి నేను రెడీ. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం. చర్చలో నేను ఓడితో ముక్కు నేలకు రాస్తా. అదే విధంగా మీరు ఓడితే మీరు ముక్కు నేలకు రాయాలి. ఏమీ చేయకపోగా మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత నాది’’ అని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్(Revanth Reddy).