Kodangal Pharma City | కొడంగల్‌లో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా సిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా మాట మార్చేసి కొండగల్ ఏర్పాటు చేయాలనుకున్నది ఫార్మా సిటీ కాదని చెప్తున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించినట్లు తెలంగాణ సీఎంఓ అధికారికంగా ప్రకటించింది.
కొంత కాలంగా కొడంగల్‌లో పచ్చని పొలాలు చెడగొట్టి ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తానంటున్నారంటూ బీఆర్ఎస్ సహా, కొడంగల్ స్థానికులు కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం తనను కలసిన వామపక్షాల నేతలతో రేవంత్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో ఏర్పాటుచేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెప్పారు.
Kodangal Pharma City | ‘‘కొడంగల్ ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదు. ఇండస్ట్రియల్ కారిడార్. ఉపాధి అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నాం. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పం. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. భూ సేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తాం’’ అని రేవంత్(Revanth Reddy) తాజాగా తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.