ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని అన్నారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయని తెలిపారు. ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదని అన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో చేసినట్లుగా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పనిని ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టలే(Dharani Portal) నిర్వహిస్తోందని అన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గతంలో రూ.90 వేల కోట్లు బ్యాంకులను నిండా ముంచిందని, దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఎద్దేవా చేశారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని ఎత్తిచూపారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్‌కు సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 52శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్ కంపెనీకి రూ.12745 కోట్లకు అమ్ముకుందని తెలిపారు. ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసిందని, ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆరోపించారు. ఒడిశా ప్రభుత్వం 2010లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఈ కంపెనీ నిర్వాకంపై 2017లో కాగ్ నివేదిక ఇచ్చింది. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. అయినా వినకుండా కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్టించినట్టు తెలిపారు. తన దోపీడీని కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ధరణిలో ఇప్పటివరకు 25 లక్షల లావాదేవీలు జరిగాయని, ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడంలేదని, ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి దోపిడీని మేం బయట పెడితే.. కేసీఆర్(KCR) కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్(KTR) సైబర్ నేరగాళ్లని.. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని రేవంత్(Revanth Reddy) ఆరోపించారు.