తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) కృతజ్ఞత సభలో తొలి ప్రసంగం చేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన చీడ పోయిందని.. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. ఇక నుంచి ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని.. తాము పాలకులం కాదు.. సేవకులమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం హోదాలో ముందుగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేయగా.. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.
అంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్(Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరస్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు.