తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా అత్యంత పారదర్శకంగా చేపట్టడానికి ప్రత్యేక యాప్‌ను కూడా సిద్ధం చేసింది. మరికొన్ని రోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ పథకం లబ్ధిదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వివరించారు.
ఇందిరమ్మ ఇళ్ల పతకం అమలుపై శుక్రవారం సాయంత్రం తన నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ప్రాధాన్యమిస్తున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవసరమైన సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సూచించారు.